Tuesday, July 27, 2010

మొదటి స్నేహితుడు......

ఎప్పుడు మొదలైందో మా స్నేహం నాకు సరిగా గుర్తు లేదు, ఉహ రాకముందునుంచి అనుకొంటాను. మా  నాయనమ్మ  పరిచయం చేసిందట వాడ్ని నాకు మా అమ్మ చెప్తుంది. ఆతరవాత వాడు కనిపించక పోతే అన్నం కూడా తినేవాడ్ని కాదట ఇది కూడా మా అమ్మే చెప్పింది.

కోపం వచ్చిన, బాధొచ్చినా, సంతోషం వచ్చినా నేను మొదట చెప్పేది వాడికే. నా జ్ఞాపకాల దొంతరల్లో ప్రతి పుటా వాడికి పరిచయం.  వాడ్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆనందం వేసిందో నాకు గుర్తులేదు కాని వాడ్ని కలిసిన ప్రతిసారి ఏదో తెలియని ఆనందం. 

వాడు నాకు పరిచయం అయ్యింది మొదలు ఇంత వరకు వాడ్ని కలవకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు నేను. వాడు నా మొదటి స్నేహితుడు వాడి పేరు TEA.

Tuesday, January 12, 2010

ఏవి ఆ భోగి సంబరాలు??

చిన్నప్పుడు, సంక్రాంతి పండగోస్తుందంటే సంబరమే సంబరం. ఎందుకంటే ఎ పండగకి  బట్టలు కొనకపోయినా సంక్రాంతి పండగకి మాత్రం కచ్చితంగా కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్ళు.

ఇంకోటి భోగి, ఆ రోజు జరిగే భోగి మంట పందాలు. ప్రతి బజారులో ఎవడు పెద్ద భోగి మంట వేస్తాడు అని పందెం. గెలిసినవాడు  ఆ రోజు చొక్కా కాలరు ఎగరేసి ఊరంతా తిరిగి వాడి గెలుపు గురించి కధలు కధలు గా చెప్పే వాడు. భోగి మంట పందెం లో గెలవాలంటే అంత  వీజీ కాదు. దానికి మంచి strategy కావాలి దాన్ని పక్కా గా అమలు చెయ్యాలి. మా అన్న దీనిలో మంచి పండితుడు(strategist) . మా బజార్లో ఎప్పుడు మేమో గెలిచే వాళ్ళం.

మేము 5-7 తరగతులు మా అమ్మమ్మ వాళ్ళ వూళ్ళో చదివాము. అక్కడ కారుమంచి గడ్డి అని, బాగా జొన్న చొప్పంత ఎత్తు పెరుగుతుంది. మేము సంక్రాంతి నెల పెట్టటం ఆలస్యం ప్రతి ఆదివారం ఆ గడ్డి కోసుకు రావటం ఎండ పెట్టటం. భోగి రెండు రోజులు వుంది అనంగా వాటిని చిన్న చిన్న మోపులు కట్టి నిలపెట్టే వాళ్ళం. ఇంక భోగి రోజు వాటికీ మంట పెడితే ఆకాశానికి తాకుతున్నాయా అన్నంత ఎత్తు మండేవి. ఇంకేముంది మా బజరులోనే కాదు పక్క బజారులో కూడా మేమే కింగులు.

7-10 మా ఊర్లో అక్కడ జొన్న చొప్ప, మొక్కజొన్న కంకేల మీద వుండే పొత్తులు పండగ టైం కి బాగా దొరికేవి. భోగిరోజుకి వీలైనంత ఎక్కువ వీటిని పోగేయ్యటం ఓ రెండు మూడు గంటలు మంట వెయ్యటానికి సరిపడా "అన్న"మాట. ఇంకా ఆ రోజు సాయంత్రం దివిటిల ఆట... అంటే, జొన్న చొప్పకి చివర మంట పెట్టి తిప్పుతూ వుంటారు. మనకి దివిటి తిప్పే అనంత సీన్ లేదు కాని, కూర్చొని దివిటి తిప్పటం చూడడం ఒక సరదా అంతే.

కానీ ఇప్పుడు ఏవి ఆ సంబరాలు. పొద్దు పొద్దునే ఆఫీసు కి వస్తూ ఆ రోజులని గుర్తుకు తెచ్చుకోవటం తప్ప.

Monday, January 4, 2010

శ్రమైక జీవన సౌందర్యం .....

అవ్వటానికి రైతు బిడ్డనే అయినా, చాలా సార్లు పొలంపని చేసినా  శ్రమైక జీవన సౌందర్యం గురించి  నాకు పూర్తిగా అవగతం కాలేదనే చెప్పాలి. ఈరోజు, దాని గురించి మొత్తం తెలియక పోయిన కొంత వరకు తెలిసిందనే చెప్పాలి. ఎలా అంటారా నేను ఒక సైకిల్ కొన్నాను, దాని మీదే ఈరోజు ఆఫీసుకి  వెళ్ళాను. ఐతే ఏంటి అంటారా నేను వుండేది కుకట్ పల్లి  లో, ఆఫీసు ఏమో  హైటెక్ సిటీ లో. దగ్గర దగ్గర 8KM వుంటుంది అనుకొంటాను. ఇప్పడు ఏమంటారు??.
ఏంటి 8KM కే శ్రమైక జీవన సౌందర్యం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా అంటారా  సరే ఐతే  అసలు విషయం లో కి వచ్చేద్దాం.

అసలేమయింది అంటే మొన్న ఒకరోజు హడావుడి గా ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే, హైటెక్ సిటీ స్టేషన్ దగ్గర ఒక పిల్లోడు ఆపాడు, ఇంటర్మీడియట్ చదువుతూ వుంటాడనుకొంటాను అన్నా ఒక రెండు నిముషాలు నీ టైం ఇస్తే నేను ఒక విషయం చెప్తాను అన్నాడు. సరే చెప్పు చిన్నా అన్నాను. గ్రీన్ పీస్ గురించి ఒక అర్ధ గంట చెప్పాడు అర్ధ గంట తరువాత, అన్నా, నీవంతు గా భూమాతని కాపాడటానికి ఏమి చేస్తున్నావన్నాడు.  అబ్బో చాలా చేస్తున్నా తమ్ముడు, పెరుగు షాపువాడు పోలతీన్ కవర్ ఇచ్చినా తీసుకొను, డైలీ బస్సు లో ఆఫీసు కి వెళ్తున్నాను(బండి కొని పెట్రోల్ తగలెయ్యకుండా ) అలా చెప్పుకుంటూ పోతుంటే, ఆ పిల్లోడు అన్నాయ్ నువ్వు భూమిని పాడు చేసేది కొండంత ఐతే నువ్వు చేస్తుంది గోరంత అని బ్రెయిన్ వాష్ చేసి పంపాడు.   

 అలా ఆ పిల్లోడి చెప్పిదాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. ఇంక ఎప్పటినించో గొలుసులతో కట్టేసిన ఆత్మారాముడు ఒక్క సారి గొలుసులు తెంచుకొని ముందొచ్చి నిలబడ్డాడు. తరువాత  వళ్ళు విరుచుకొని   వొరేయ్ అబ్బాయ్, నీ బతుక్కి ఎలాగు ఆ పిల్లాడిలా, నిద్రావస్తలో ఉన్నవాళ్ళని జాగృత పరచలేవు, కాలేజీ లోంచి బయటపడి మూడు నెలలు అయ్యిందో లేదో  కొవ్వు పెరిగి వూరిపోతున్నావు కాబట్టి,  ఆ కాబట్టి రెండు విడతల పదకం అమలు పరచాల్సిందే అని గొంతు చించుకొని అరిచాడు. 

 ఇంక ఆత్మారాముడి ఘోష  బరించలేక,   మొదటి విడతలో కాఫీమగ్గ్  ఒకటి కొన్నాను. మీకు తెలియదుగా నేను రోజుకి నికరంగా ఐదు, ఆరు సార్లు కాఫీ తాగుతాను. ప్రతిసారి ఒక పేపర్ కప్ తగలేయకుండా మగ్గ్ అన్నమాట. రెండొవ విడతలో సైకిల్ కొన్నాను, ఇంకో college mate + collegue తో కలసి. అలా ఈరోజు ఆఫీసు కి సైకిల్ మీద వెళ్ళటం, మీకు ఈ సుత్తి అంతా చెప్పటం జరిగింది.

సైకిల్ తొక్కుకు ఆఫీసు కి వెళ్లేసరికి వొళ్ళు పులిసిపోయింది కాని, శుభ్రం గా నేను, నా ఫ్రెండ్ చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకోన్నాం. ఆఫీసు కి వెళ్ళాక, రోజు కుర్చొంటే ఇబ్బంది గా వుండే ఆఫీసు లో నా కుర్చీ చాలా సౌకర్యం గా అనిపించింది. రోజు తిట్టుకొంటూ తినే భోజనం బ్రహ్మాండం గా అనిపించిది బాగా ఆకలేసింది మరి (కాలితే గుఱ్ఱం గానుగ చెక్క తింటుంది అంటారు చూడండి అలా). అందుకే శ్రమైక జీవన సౌందర్యం అనే పెద్ద మాట వాడానండి బాబు........

నాతో పాటు సైకిల్ కొన్న మిత్రుడు ఒక comic గీశాడు దీనిమీద... దాన్ని ఇక్కడ చూడండి..
http://fullbc.in/index.php?comicid=54